Tuesday, 28 June 2016

ఐ లవ్ యూ :)

ఐ లవ్ యూ :)
"ఏదో చెప్తా అని పిలిచావ్...?!"
"నువ్వు చాలా అందంగా ఉన్నావ్!"
"ఇదైతే చాలాసార్లు చెప్పావ్ కదా?"
"అయితే ఇది కాదు.."
"మరింకేంటి?"
"నీ నవ్వు బాగుంది!!"
"హే.. ఇది కూడా చాలాసార్లు చెప్పావ్.."
"అయితే ఇది కూడా కాదు"
"మరదేదో చెప్పు.."
"కాసేపు నిన్నలా చూడనీ.."
"ఇలా చూస్తూ కూర్చుంటే చెప్పాల్సింది మరచిపోతావేమో?"
"మరచిపోనీ, మళ్ళీ ఇంకెప్పుడైనా గుర్తొచ్చినప్పుడు చెప్పుకోవచ్చు.."
"వేషాలేస్తున్నావా..?? చెప్పొచ్చు కదా???!!!"
"సరే.. చెప్పేస్తున్నా.. వింటున్నావు కదా??"
"చెప్పూ.."
"నిన్నెక్కడికైనా తీసుకెళ్ళాలనుంది.. అంటే దూరంగా.. నీక్కూడా తెలియని ప్రదేశానికి.. మనిద్దరమే కూర్చొని
చుక్కలు లెక్కబెట్టాలక్కడ"
"లెక్కబెడుతూ.."
"లెక్కబెట్టాలంతే.."
"అదే.. లెక్కబెట్టి??"
"అవును లెక్కబెట్టి?? హే.. నో.. నేను చెప్పాలనుకున్నది ఇది కాదు.."
"పర్లేదు. ఇది బాగుంది. చెప్పు.."
"హ్మ్.. ఒక్కో చుక్కకు నిన్ను పరిచయం చేయాలి.."
"ఏమని??"
"నువ్వు నాకేమవుతావో.. అదని.."
"ఆ తర్వాత.."
"హే.. నే చెప్పాల్సింది ఇది కాదన్నానా.."
"సరే.. ఏం చెప్పాలనుకున్నావో.. అదిప్పుడు చెప్పు.."
"అది గుర్తుకొస్తే ఇదెందుకు చెప్తా.."
"పోనీ ఇది పూర్తి చెయ్.."
"ఇది పూర్తి చేయగలిగేతే అదెందుకు గుర్తుచేస్తా.."
"ఉఫ్‌ఫ్.. ఏదోకటి చెప్పు.."
"ఐ లవ్ యూ.."
":) :)"

మనం మర్చేపోయినం మావయ్యా!!


'ఇష్కు కరూ యా కరూ ఇబాదత్.. ఇష్క్ కరూ యా కరూ ఇబాదత్..' అంటూ  నాకూ, నాని గాడికి ఇద్దరికీ నచ్చిన పాట ప్లే అవుతోంది. ఇద్దరం సోనమ్‌ని  చూస్తూ కూర్చుండిపోయాం..

పాట మధ్యలో "మై తుమ్‌సే ప్యార్ కర్తా హూ.. ఔర్ తుమ్?" అన్న డైలాగ్ అక్కడ రాకముందే వాడు చెప్తూంటే.. "మై బీ!" అన్నా కన్నుకొడుతూ..

ఇద్దరం నవ్వుకున్నాం.. నవ్వుతూనే నాకు దగ్గరగా వచ్చి "మై బీ" అన్నాడు.

నేనింకేదో మాట్లాడేలోపే వాడే మళ్ళీ ఏదో గుర్తుతెచ్చుకొని.. "మావయ్యా నాకొకటి కొనియ్యాలి!!"

"ఏంటిదీ?"

"అదే మావయ్యా.. చిన్న లైట్.. నువ్వప్పుడు కొనిచ్చినవ్.. చిన్నది మావయ్యా.."

"హ్మ్.. అయినా ఇప్పుడదెందుకురా??"

"నాకు కావలన్ననా!!"

"సరే.. అదెక్కడ దొరుకతదో కదరా?"

"మొత్తం ఊరంత తిర్గుదం.. దొరుకుతది మావయ్యా!"

"ఏయ్.. ఇప్పుడు లైట్ కావాల్నా, ఊరు తిరగడం కావాల్నా?"

"లైటే! మరది ఎక్కడుంటదో అన్నవ్ కదా?" ఆ కళ్ళల్లో కొంటెతనం నీ గర్ల్‌ఫ్రెండ్ కూడా చూపించలేదు.

"పోదాం పా" అని చెప్పి బైక్‌పై ఊరంతా తిప్పా.

ఈ మధ్యలో చౌరస్తా దగ్గర "ఆ దిల్‌పసంద్ తిందాం" అంటే ఆగాం.  పక్కనే ఉన్న పోస్టర్ చూసి, "రేపు మనం ఈ 
సినిమాకు పోతున్నం కదా!" మళ్ళీ  కన్నుగొట్టాడు.

"రేయ్.. నక్రాలు చెయ్యకు. మన హీరో సినిమా (;)) వచ్చే నెల వస్తది. అప్పటిదాంక వేరే సినిమా లేదు!"

"హ్మ్.." ఈ ఎక్స్‌ప్రెషన్‌కి నిజంగా అర్థం లేదు.

మళ్ళీ ప్రకాశం బజార్‌లో 'కొంబరి బోండాం తాగుతా' అంటే అక్కడ ఆగినప్పుడు.. "నాకెందుకో లైట్ 
దొరకదనిపిస్తుందిరా" అన్నా.

ఒక్కసారే సీరియస్ అయిపోయాడు. "ఆ.. ఎందుకు దొరకదు. అప్పుడు దొరకలేదా?"

"సరే.. సరే.. దొరుకుతదిలే" అనంటే మళ్ళీ నవ్వేశాడు. 

ఎక్కడెక్కడైతే అది దొరుకుతుందన్న ఆలోచన ఉందో, అవన్నీ తిరిగి తిరిగి దాదాపుగా అలిసిపోయాం..

ఈమధ్యలో ఒకసారి "నేను హైద్రాబాద్ వచ్చేస్త మావయ్యా" అన్నాడు.

"మరి అమ్మ?"

"అమ్మ కూడ వస్తది"

"నాన్నా? ఇల్లూ?"

"హ్మ్.. ఇల్లు కూడ తీస్కపోదం మావయ్యా"

"హహహ.. ఇల్లెట్ల తీస్కపోతంరా.. ఊరు?"

"ఊరు కూడ తీస్కపోదం మావయ్యా" అన్నప్పుడు నవ్వాపుకోలేకపోయా.. వాడూ నన్ను చూసి నవ్వుతూనే ఉన్నాడు.

దేనికోసమైతే వచ్చామో దాన్ని ఈ ప్రయాణంలో మెల్లి మెల్లిగా మర్చిపోయాం. ఈ మధ్యలో ఎన్నో మాట్లాడుకున్నాం.

విమానం ఎక్కాం. వాణ్ణి హీరోగా పెట్టి నేనొక సినిమా తీశా.  వాళ్ళత్త (;)) ఎలా ఉంటదో ఓ అంచనా వేసుకున్నాం. ఊరు ఏమైపోతదో  లెక్కలేసుకున్నాం. మహేష్ అన్న సినిమాను సూపర్ హిట్ చేసేశాం. నాకు పెళ్ళి  చేయాలన్న ఆలోచన కూడా చేశాడు (ఇందులో నా ప్రమేయం లేదు!). ఇంకా ఏవో.. ఏవేవో..  అన్నీ గుర్తుంచుకోవాల్సినంతవి కాకపోవచ్చు. 

ప్రయాణమంటేనే ఓ అనుభూతి... అది చిన్నదో, పెద్దదో!  ముగుస్తుందేమో అన్న బాధ, మళ్ళీ ఎలా మొదలుపెట్టాలన్న ఆలోచనా.. రెండూ లేని  అందమైన ప్రయాణమిది.

చెప్పలేదు.. ఇంక వెళ్లిపోదాం అని తిరిగొచ్చేస్తుంటే..  బస్టాండ్ ఎదురుగా చిన్న బండిపై కనిపించిందా లైట్. 

"మావయ్యా మనం మర్చేపోయినం  మావయ్యా!" అంటున్నప్పుడు వాడి కళ్ళు మళ్ళీ మెరిశాయ్! 

ఆ లైట్ దొరక్కున్నా ఈ ప్రయాణం ఇంతే బాగుంటుందా? ఏమో? ఉంటుందేమో! :) 

మధ్యాహ్నాల్లోనూ రొమాన్స్ ఉంది!!

మధ్యాహ్నాల్లోనూ రొమాన్స్ ఉంది!!
ఒక రోజులో ఏదైనా నీకు నచ్చిన సమయం గురించి రాయమంటే ఏం రాస్తావ్??
పొద్దున్నే లేవాలని ఉన్నా లేవలేకపోవడానికి కారణమైన బద్ధకం గురించో..
పోనీ, లేస్తే, ఫ్రెండ్‌తో సరదాగా మాట్లాడుతూ చేసే వాకింగ్ గురించో..
అమ్మ చేత్తో కలిపిచ్చిన కాఫీ తాగుతూ, ఆవిడతో చెప్పుకునే కబుర్ల గురించో..
పదకొండప్పుడు తాగే రెండో కాఫీ గురించో..
నాని గాడితో ఇరానీ కేఫ్‌కెళ్ళి తాగే ఛాయ్ గురించో..
పన్నెండొకటప్పటి నీకిష్టమైన భోజనం గురించో..
సాయంత్రం నాలుగప్పటి మార్చే అవకాశం లేని టీవీ సీరియల్ గురించో..
గర్ల్‌ఫ్రెండ్‌తో గడిపే అందమైన సాయంత్రం గురించో..
ఫ్రెండ్‌తో వెళ్ళే సెకండ్ షో గురించో..
ఎప్పుడో కొన్న పుస్తకం చదవాలని కూర్చునే ఓ రాత్రి గురించో..
నీకిష్టమైన ఫ్రెంచ్ సినిమా సబ్‌టైటిల్స్‌తో చూసే అర్థరాత్రి గురించో..
కళ్ళింకా మూసుకోలేదని, కన్నీళ్ళను దాచటానికి మనమే మూసామని చెప్పే అర్థరాత్రుల్ల గురించో..
రాత్రి మూడప్పుడు నీకిష్టమైన వ్యక్తితో చేసే ఛాటింగ్ గురించో..
ఎన్నో ఉన్నాయి కదా.. పొద్దుణ్ణుంచి, మళ్ళీ పొద్దున వరకు ఇలా చాలా ఉన్నాయి కదా!
ఇందులో సరిగ్గా చూస్తే, మధ్యాహ్నం గురించి మనం పెద్దగా మాట్లాడట్లేదు తెలుస్తోందా?
అంటే మధ్యాహ్నాలు అంత బోరింగా? మధ్యాహ్నాల్లో మనం రాయడానికి పనికొచ్చే రొమాన్సే లేదా?
లేదేమో, ఉంటే ఎందుకు రాసుకోమూ?
నో.. నో.. ఉందేమో, రాసేంత ధైర్యం లేనంత శూన్యం ఉందేమో మధ్యాహ్నాల్లో..
ఒక్కసారే మధ్యాహ్నాలను గుర్తు చేసుకుంటూ వెనక్కి వెళ్ళాలనిపించింది..
మధ్యాహ్నాల్లో ఎక్కువగా బాధే ఉంటుందనుకుంటా..
బయటకు కనిపించని, శూన్యంలో చేస్తున్న ప్రయాణం లాంటిదేదో నడుస్తూంటుందప్పుడు..
ఎవరితోనో ఏదో చెప్పుకోవాలని, చెప్పుకోవడానికి అప్పుడక్కడ ఎవ్వరూ లేరనీ అర్థమయ్యేది మధ్యాహ్నల్లోనే అనుకుంటా..
అర్థమై అర్థం కానట్టుండే జీవితంలోని చిన్న భాగాన్ని మధ్యాహ్నమే పరిచయం చేస్తుంటుందనుకుంటా..
మధ్యాహ్నాల్లోనే కొన్ని పుస్తకాలు, సినిమాలతో పరిచయం ఏర్పడుతుందనుకుంటా..
అవన్నీ అప్పుడే నిన్ను నీకు కొత్తగా పరిచయం చేసి, నీ శూన్యాన్ని నీకే గుర్తు చేసి ఏడిపిస్తాయనుకుంటా..
మధ్యాహ్నాల్లోనే ఏదో తెలియని సమాధానం కోసం వెతుకుతుంటావనుకుంటా..
మధ్యాహ్నాల్లోనే నీకు కొన్ని సందర్భాల్లో ఎవ్వరూ ఉండరని తెలుస్తూంటుదనుకుంటా..
అందుకేనేమో, మధ్యాహ్నానాన్ని రాసేంత ధైర్యం ఇప్పటికీ చేయలేదు.
అయితే, మధ్యాహ్నాల్లోనూ రొమాన్స్ ఉందన్నమాట..
దాన్నందుకునే ధైర్యం లేదంతే!!

అదేనేమో ప్రేమంటే..!

అదేనేమో ప్రేమంటే..!

తనకిష్టమైన (నాకూ ఇష్టమైపోతుందది) కస్టర్డ్ ఆపిల్ ఫ్లేవర్ రెండు ఆర్డర్ ఇచ్చి వచ్చి పక్కన కూర్చుంది.

కొద్దిసేపేమీ మాట్లాడుకోలేదిద్దరం. అటూ ఇటూ చూస్తోంది. సడెన్‌గా టీవీలో 'అగర్ తుమ్ సాథ్ హో' అన్న పాట వస్తోంటే అటువైపు తిరిగింది.
"హే నా ఫేవరైట్ సాంగిది తెల్సా!" అని చెప్పి తనకొచ్చీ రాని హిందీలో పాడుకుంటుంటే నవ్వాపుకోలేకపోయా.
"ఎందుకు నవ్వుతున్నావ్?" సగం కోపం, సగం నవ్వుతో అడిగింది.
"కొన్నిసార్లు నవ్వి ఊర్కోవడమే బాగుంటుంది. నీకెలా అర్థమైనా కూడా!"
"లోల్.. నేనడిగిందేంటీ? నువ్వు చెప్తుందేంటీ?"
నవ్వా.
"సరే.. నాలో నీకేమంటే ఇష్టం!?"
మళ్ళీ తనే "నీ కళ్ళంటే, నీ నవ్వంటే ఇష్టం.. ఇలాంటి డైలాగ్స్ వద్దు!"
"ఓకే!"
"ఓకే ఏంటీ? చెప్పూ.."
"ఆలోచించుకోనీ.. నీలో నచ్చేన్ని లక్షణాలు దొరకాలిగా"
"లోల్.. చంపేస్తా.."
"హహహ.. కూల్. హ్మ్.. నువ్విలా, ఇప్పుడడిగావ్ చూడూ.. అలా ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉండడం
ఇష్టం"
"ఎలాంటి ప్రశ్నలూ.."
"ఎలాంటివైనా.. మనం సినిమా చూస్తున్నప్పుడు, నువ్వు నన్నే చూస్తూ, ఓ డైలాగ్ సరిగ్గా వినవ్! మళ్ళీ ఆ డైలాగ్ ఏంటని ఓ ప్రశ్నడుగుతావ్ చూడు.. అలాంటి ప్రశ్నైనా కావొచ్చు!"
"లోల్.. నిన్నే చేస్తూ అంటా.. హహ.. ఇంకా?"
"లైఫ్ ఏంటీ? కెరీర్ ఏంటీ? ఏం చేద్దామ్ అనుకుంటున్నావ్? ఎక్కడికైనా పారిపోయి కొన్నాళ్ళు ఉంటే
ఎక్కడుందాం? నన్ను ఎక్కడికైనా తీస్కెళ్ళంటే ఎలా ప్లాన్ చేస్తావ్? నన్ను ఎప్పుడైనా మర్చిపోయే పరిస్థితులొస్తే మర్చిపోతావా? ఇలా నువ్వడిగే ఏ ప్రశ్నైనా ఇష్టమే!"
"అవును.. నిజంగా అలాంటి పరిస్థితులేవైనా వస్తే నన్ను మర్చిపోతావా?"
"హహహహహ"
"నవ్వకు. చంపేస్తా!"
"ఇంకా.. నీకో విషయం తెల్సా.. చిన్నపిల్లల ప్రశ్నలు బాగుంటాయ్, అలాంటి ప్రశ్నలడుగుతారు కాబట్టే వాళ్ళింకా బాగుంటారు. నీలాగా.."
"లోల్.. నేను చిన్నపిల్లనా?"
"నేనలా అన్లేదు. యూ ఆర్ స్ట్రాంగ్, ఇండిపెండెంట్, చిన్న పిల్లలా కూడా ఆలోచిస్తావ్!"
"ఏంటో నువ్వు.. పొగిడావో, తిట్టావో అర్థం కాదు! బైదవే ఇందాక మర్చిపోతావా అంటే నవ్వి ఊరుకున్నావ్. సమాధానం చెప్పలేదు!"
"హహహ"
"సమాధానం చెప్పూ.."
"హేయ్.. నీ ఇంకో ఫేవరైట్ సాంగ్ వస్తోంది చూడూ.."
"అది వస్తూనే ఉంటుందిలే.. నువ్వు చెప్పవోయ్!"
"చెప్పను బ్రదర్" గట్టిగా నవ్వా.
"లోల్.. నీ.." మీదకొచ్చి కొట్టబోయింది.
"నువ్వు లోల్ అన్నప్పుడల్లా ఎంత అందంగా ఉంటావో తెల్సా. నీకోసమే కనిపెట్టారేమో అది. నాకోసం కూడా ;)"
"అహా.. చంపేయాలి నిన్ను.."
"నాకిది అస్సలు నచ్చలేదు.."
"ఏదీ?"
"ఇలా మీదకొస్తే, ముద్దిస్తావనుకున్నా!"
"లోల్.. నేను ఇవ్వను బ్రదర్!"
"హహహహహ"
"బట్ యా.. థ్యాంక్ యూ.."
"ఎందుకూ?"
నవ్వింది.
ఆ నవ్వును అలా చూస్తూ ఉండడానికి ఏమేం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చోవడమేనేమో ప్రేమంటే..! :)

Sunday, 3 August 2014

పాత మిత్రుడు 
వాడే.. కచ్చితంగా వాడే..
వాడు కాకుండా పోయే అవకాశమే లేదు.
ఎంత మందిలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా వాణ్ణి గుర్తుపడతా!
ఒకవేళ వాడు కాదేమో అన్న అనుమానమున్నా
చెప్తుంది నేను కాబట్టి కచ్చితంగా వాడే!
ఒకప్పుడు వాడే నేను, నేనే వాడు
నన్ను నేను గుర్తుపట్టలేనా?!

దగ్గరికెళ్లి మాట్లాడదామనుకున్నా
(అనుకోవడం దగ్గరే ఆగిపోయా)
దూరం నుంచే చూస్తూ నిలబడ్డా
నవ్వుతూ నన్ను పిలుస్తున్నాడు వాడు.
(చెప్పలేదు కదూ మధ్యే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నా!)
ఏదైతే అదని వాడి ముందెళ్లి నిలబడ్డా
కాసేపంతా నిశ్శబ్ధం
( నిశ్శబ్ధం బయటకు కనపడేది మాత్రమే)

ఏం మాట్లాడకుండా వాణ్ణి గట్టిగా కౌగిలించుకున్నా
ఆగకుండా కళ్ల నుండి కన్నీళ్లలా వస్తూనే ఉన్నాయ్!
వాడు నన్నన్న మాటలు
వాణ్ణి నేనన్న మాటలు
వాడి గురించి నేననుకున్న మాటలు
నా గురించి వాడనుకున్న మాటలు
వాడి గురించి నేను విన్న మాటలు
నా గురించి వాడు విన్న మాటలు
అన్నీ.. అన్నీ కన్నీళ్లలో కొట్టుకుపోయాయ్!వాడేం మాట్లాడట్లేదు
నేనూ ఏం మాట్లాడట్లేదు
అలానే చూస్తూ ఉన్నాడు
'ఎందుకురా ఇన్నాళ్లు నాతో మాట్లాడలేదు?
ఎందుకురా... ?
ఎందుకురా... ?ఆవేశంగా.. ఆవేదనగా అడుగుతున్నా.
వాడూ నేనడిగిన ప్రశ్నలే అడుగుతున్నాడు అంతే ఆవేశంగా.. ఆవేదనగా...
అయితే అవన్నీ కళ్లతోనే..
కళ్లతోనే సమాధానాలిచ్చుకుంటున్నాం.


నోరు తెరిచి వాడు ఒక మాట మాట్లాడలేదు
నేనూ ఒక్క మాట మాట్లాడలేదు
ఇద్దరం ఒకరి ముఖం ఒకరం చూసుకొని చిన్నగా నవ్వుకున్నాం

నేను వాడి బండెక్కి అక్కణ్ణించి వెళ్లిపోయాను
(నా బండి అక్కడే ఉందన్న విషయం గుర్తున్నా కూడా..)

కలలెంత అందంగా ఉంటాయో కదా!!!

By
V. Mallikarjun.